Skip to main content

Posts

Showing posts from April, 2022

[Telugu Poem] ఓ మనిషి కథ

గగనమంత ఉషస్సు నాది సముద్రమంత నిశీధి నాది  ఆనంద పర్వతాలు నావి విషాద పాతాళాలు నావి  ఉత్సాహభరిత గంతులు ఉల్లాసభరిత నవ్వులు ఉత్తేజభరిత ఊహలు అన్నీ నావే  మనస్సు మోయలేని భారాలు పెదవి విప్పలేని మౌనాలు కాలం చెరపలేని గాయాలు అవి కూడా నావే  ఆహ్లాద పరిచి సమయాన్ని మింగేసే సరదాలు ఆనంద పరిచి మార్పు రానివ్వని అలవాట్లు స్ఫూర్తినిచ్చి తృప్తిగా ఉండనివ్వని లక్ష్యాలు అవి కూడా నావే  పలకరించే బంధాలు ఆత్మీయత పంచే స్నేహాలు ప్రపంచం ఏకమైనా తాకలేని ఏకాంతలూ అన్నీ నావే  అహం దాటి పొంగే ఆదర్శాలు  అవధులు లేక సాగే కళా ఖండాలు  అసాధ్యాన్ని సుసాధ్యం చేసే సామర్ధ్యాలు  అన్నీ నావే  నిజం మరచి మండే విద్వేషాలు  జాలి లేక కాల్చే మారణఖాండలు   కూర్చున్న కొమ్మనే నరికేసే మూర్ఖత్వాలు  అవి కూడా నావే  ఎంత బ్రహ్మ అయినా అబ్బురపడి చూసే మనిషిని నేను  ఎన్ని జన్మలైనా అర్ధం కాని మనసు నాది