బుచ్చిబాబు ఉండేది ఆదిలాబాద్ నగరంలో. బుచ్చిబాబు ఐదున్నర అడుగులు ఉంటాడు. ఛామన ఛాయ, వతైన జుట్టు. ఏడు సంవత్సరాల నుంచి రెవెన్యూ డిపార్ట్మెంట్ లో క్లర్క్ గా పని చేస్తున్నాడు. ఆఫీసుకి మూడు కిలోమీటర్ల దూరంలో ఇల్లు. వారంలో ఆరు రోజులు ఇంటి నుంచి ఆఫీసుకి, ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్లడం, ఆదివారం అయితే విశ్రాంతి తీసుకోవడం అతని దినచర్య. కొత్త ప్రదేశాలకు వెళ్లడం చాలా తక్కువ.
రోజు ఇంటికి వెళ్లే ముందు స్నేహితులతో కాంటీన్లో టీ తాగడం అలవాటు . ఈ రోజు కూడా ముగ్గురు స్నేహితులతో పాటు కాంటీన్ కి వచ్చాడు. వారితో పాటు సుబ్బయ్య కూడా వచ్చాడు . సుబ్బయ్య, బుచ్చిబాబు ఒక్కప్పుడు ప్రాణ స్నేహితులు. కానీ ఇప్పుడు వాళ్ళ మధ్య పచ్చ గడ్డి వేస్తే బగ్గుమంటది.
వీళ్ళ గొడవకు కారణం ఐదు సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన. ఆఫీసులో ప్రొమోషన్ల కోసం తహసీల్దార్ రివ్యూ చేస్తున్నాడు. బుచ్చిబాబు, సుబ్బయ్య ఇద్దరూ అర్హులే. కానీ బుచ్చిబాబుకి సుబ్బయ్య కంటే ఒక సంవత్సరం అనుభవం తక్కువ ఉండడం వల్ల తహసీల్దారు తన విచక్షణాధికారం వాడి ఒక సంవత్సరం ఆలస్యం చేయొచ్చు. ఆలా చేయకుండా వుండాలంటే లక్ష రుపాయలు లంచం అడిగాడు. సుబ్బయ్య బుచ్చిబాబుకి ధైర్యం చెప్పి తాను డబ్బు సర్దుబాటు చేస్తాను అన్నాడు. తీరా చివర రోజు వచ్చాక డబ్బు సర్దుబాటు కాలేదు అని చెప్పాడు. తాను ప్రమోషన్ పొందడం ఇష్టం లేకనే సుబ్బయ్య ఇలా కావాలని చేసాడని బుచ్చిబాబు కోపం తెచ్చుకున్నాడు . సుబ్బయ్య ఎదో చెప్పడానికి ప్రయత్నించినా వినకుండా వెళ్ళిపోయాడు. ఆ రోజు నుంచి విభేదాలు పెరిగి పెరిగి మాటలు లేని స్థాయికి తరువాత అసలు ఒకరిని ఒకరు చూసుకోలేని స్థాయికి చేరాయి. చిన్న విత్తనం నుంచి మహా వృక్షం పెరిగినట్టు .
సుబ్బయ్య తప్ప అందరితో మాట్లాడుతూ టీ తాగాడు. ఇంతలో తన చెప్పు తెగిన సంగతి గుర్తుకు వచ్చింది.
"చెప్పులు కుట్టే షాపు దగ్గరలో ఎక్కడ ఉంది" అని అడిగాడు బుచ్చిబాబు.
"సుబ్బయ్యకు తెలుసేమో అడుగు " పరాచకం ఆడారు మిత్రులు.
"మీకు తెలిస్తే చెప్పండి లేకుంటే లేదు"
"సరేలే కోపం ఎందుకు, దగ్గరలో థియేటర్ పక్కన ఉంటాడు"
అది బుచ్చిబాబు ఎప్పుడూ వెళ్లే దారి కాదు. థియేటర్ దగ్గరలో ఏరియా బుచ్చిబాబుకి అంత నచ్చదు. అది బస్తీ ఏరియా. జనాలు మురికిగా, బాధ్యత లేకుండా ఉంటారు అని అతని అభిప్రాయం. కానీ ఇంక తప్పదు కదా అని వెళ్ళాడు. చెప్పులు కుట్టే అతనికి చెప్పులు ఇచ్చి నిల్చున్నాడు. ఇంతలో అతని కూతురు వచ్చింది.
"డాక్టరు ఇంట్లో , ఇంజనీర్ ఇంట్లో వంట అయిపోయింది నాన్న" అని చెప్పింది.
"సరేమ్మ, వెళ్లి పూలు అమ్మే పని చూడు" అన్నాడు కుట్టేవాడు.
బుచ్చిబాబుకు పిల్లలు పని చేయడం అస్సలు నచ్చదు. కానీ నాకెందుకులే అనుకున్నాడు.
తరువాత కాలక్షేపం కోసం అడిగాడు.
"పిల్లల్ని బడికి పంపకుండా పనేమిటి" అన్నాడు బుచ్చిబాబు.
"ఇల్లు గడవాలి కదా బాబు" అన్నాడు చెప్పులు కుట్టేవాడు.
"ఇల్లు గడవాలంటే పెద్ద వాళ్లు కష్టపడాలి . అంతేగాని పిల్లల్ని పనిలో పెడతారా"
"కొద్ది రోజులు చదివించా బాబు. నేను నా ఇంటిది పనికి పోయే వాళ్ళం. దానికి ఒక రోజు కాలికి దెబ్బ తాకింది. తగ్గుదిలే అని వదిలిస్తే సెప్టిక్ అయ్యి ఆపరేషన్ చేసారు. ఇప్పుడు కాలు పడిపోయింది. దానికి నెల నెలా మందులు ఖర్చు కూడా చానా అవుతుంది. నేను బలం ఉన్నంత కాలం కూలీ చేశాను. కానీ ఇప్పుడు బొక్కలు అరిగినయి అంట. మానేసి షాపు పెట్టుకున్నా. రెక్కాడితే డొక్కాడని వాళ్ళం, ఇంక తప్పక అమ్మాయిని పనిలో పెట్టాను బాబు"
బుచ్చిబాబుకి అతను చెప్పింది అర్ధం అయ్యింది.
బుచ్చిబాబు తిరిగి ఇంటికి బయలుదేరాడు. ఎప్పుడూ ఇటు వైపు రాలేదు. తను మాములుగా వెళ్లే దారిలో అన్నీ కాంక్రీట్ భవనాలే. కానీ ఇక్కడ రోడ్డుకి రెండు వైపులా చక్కటి పచ్చదనం, ముఖానికి తాకుతూ చల్లటి గాలి. దారిలో ఎన్నో ఆలోచనలు.
"అతను చెప్పింది నిజమే అనిపిస్తుంది. పిల్లలు పని చేయకూడదు అనుకున్నా కానీ అసలు ఎందుకు చేస్తున్నారు అని కారణాలు ఆలోచించలేదు. ఎదుటి వారి స్థానంలో ఉండి ఆలోచిస్తే కానీ ఎవరి ప్రవర్తన అయినా పూర్తిగా అర్ధం కాదు అనుకుంటా. ఆకలి బాధ లేనప్పుడు ఎన్ని సిద్ధాంతాలు అయినా చెప్పుకోవచ్చు. కడుపు కాలుతుంటే వేదాంతం బోధ పడుతుందా పాపం" అనుకున్నాడు.
ఇంటికి చేరుకొని ముఖం కడిగి కుర్చీలో కళ్లు మూసుకు కూర్చున్నాడు. చెవిలో చెప్పులు కుట్టే అతను చెప్పినవే మోగుతున్నాయి.
"ఏరా ఒంట్లో బాగాలేదా? " అన్నాడు నరసయ్య.
నరసయ్య బుచ్చిబాబు తండ్రి. కానిస్టేబుల్ లాగా చేసి రిటైరయ్యాడు. కుటుంబాన్ని బాగానే చూసుకున్నాడు కానీ ఎక్కువ సమయం తమతో గడప లేదని బుచ్చిబాబుకి కోపం. అసలు తనంటే తండ్రికి ఎక్కువ ఇష్టం లేదు అని నిర్ణయించుకున్నాడు. అందుకని పెడమొహంగా ఉంటాడు ఆయనతో.
"బాగానే ఉంది. ఊరికే రెస్టు తీసుకుంటున్నా" అన్నాడు బుచ్చిబాబు.
"ఇంకా అనారోగ్యం ఏమో అని భయపడ్డా" అన్నాడు నరసయ్య.
"నాన్నా నిన్ను ఒక విషయం అడగొచ్చా"
"అడుగు రా"
తెలుసుకుందామని అడిగాడు.
"ఇప్పుడు నా పైన ఇంత ప్రేమ చూపిస్తున్నావు. చిన్నప్పుడు ఎందుకు మమల్ని నిర్లక్ష్యం చేసావు"
"సరే చెప్తాను విను. నీకు ఈ సందేహం ఉందని ఊహించాను. నువ్వు అడిగినప్పుడు సమాధానం చెపుదాము అని ఎప్పుడూ ఏమీ అనలేదు. నాకు అతి కష్టం మీద కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చింది. రోజూ 17,18 గంటలు పని ఉండేది. ఆదివారం కూడా సెలవు లేదు. ఒక్క పూట మాత్రమే తిన్న రోజులు ఎన్నో. పండగలు, ఎలెక్షన్లు, గొడవలో వచ్చాయి అంటే జాగరమే. ఇంట్లో ఉండే సమయమే లేదు. ఏదైనా వ్యాపారం చేసుకోకూడదా అనేది మీ అమ్మ. చేయొచ్చు కానీ నష్టాలొస్తే? నేను కుటుంబంతో లేకపోయినా ఫర్వాలేదు మీరు బాగుంటే చాలు అనుకున్నా. అమ్మని బాగా చూసుకోగలిగా, మిమల్ని చదివించి ఉద్యోగంలో పెట్టగలిగాను. నాకు అదే తృప్తి"
"ఎదుటి వారి స్థానంలో ఉండి ఆలోచిస్తే కానీ ఎవరి ప్రవర్తన అయినా పూర్తిగా అర్ధం కాదు" అని మళ్లీ అనుకున్నాడు బుచ్చిబాబు.
తండ్రి మీద సానుభూతి కలిగింది.
"నీకు ఎప్పటి నుంచో చూపిస్తాను అన్న చీటి రేపు చూపిస్తాను" అన్నాడు నరసయ్య.
నరసయ్య దగ్గర ఒక చీటి ఉంది. మొదట్లో అతను చాలా మొండిగా ఉన్నప్పుడు బుచ్చిబాబు వాళ్ల అమ్మతో కొన్ని గొడవలు జరిగేవి. ఆమె చివరి రోజుల్లో నరసయ్యకి ఒక చీటి మీద ఎదో రాసి ఇచ్చింది. దాని విలువ వాళ్ల అమ్మ పోయిన తర్వాతనే తనకు అర్ధం అయింది అంటాడు నరసయ్య. బుచ్చిబాబు తనకు చూపించమంటే "సరైన సమయం రాని లేకపోతే అర్థం అవుతుందేమో కానీ దాని విలువ తెలియదు" అన్నాడు ఒక రోజు.
ఎదుటి మనిషి స్థానంలో ఉంటే గానీ.... ఇదే ఆలోచిస్తూ పడుకున్నాడు బుచ్చిబాబు. అదే ఆలోచిస్తూ లేచాడు.
ఆఫీసుకి వెళ్లి సాయంత్రానికి వచ్చి తండ్రిని పలకరించి పక్కన వచ్చి కూర్చున్నాడు. మాములుగా తండ్రితో ఏ విషయాలు చెప్పుకోడు కానీ ఆ రోజు చెప్పడం మొదలు పెట్టాడు.
"సుబ్బయ్యతో మాట్లాడాను నాన్న" అన్నాడు బుచ్చిబాబు.
"అవునా! చాలా మంచి విషయం చెప్పావు రా" అన్నాడు నరసయ్య. వాళ్లిద్దరి మధ్య మనస్పర్థలు ఉన్నాయని తెలుసు నరసయ్యకి.
"ఆ రోజు ప్రవర్తనకు కారణం తెలుసుకుందామని. చులకన అవుతానేమో అనిపించింది కానీ తప్పు చేయన్నప్పుడు చులకన దేనికి? మొండితనంలో అంత గొప్ప ఏముంది అయినా? అని ధైర్యం తెచ్చుకుని మాట్లాడాను"
"నిజం చెప్పావు. కారణం తెలుసుకున్నావా మరి"
"ఆ రోజు వాళ్ళ అమ్మకి జబ్బు చేసింది అంట. ప్రైవేటు ఆస్పత్రికి వెళ్తే డబ్బు సరిపోక నాకు ఇస్తానన్నవి కూడా వాడవలసి వచ్చిందంట. నాకు చెపుదాం అని ప్రయత్నించాడంట కానీ నా బెట్టు చూసి ఆగడు అంట. నాకు సరైన పనే చేసాడు అనిపించింది. ప్రాణం కంటే ఒక సంవత్సరం ముందు ప్రమోషన్ ఎక్కువ కాదు కదా"
"సరిగ్గా చెప్పావు రా, మనుషులు బాగుంటేనే కదా ఉద్యోగాలు, డబ్బులు అన్నీ"
"ఒక రకంగా బాధగా ఉంది నాన్న. మా ఇద్దరిలో ఎవ్వరు తగ్గినా ఐదేళ్ల స్నేహం దూరం అయ్యేది కాదు. పట్టుదల ఎంత చెడ్డది కదా"
"మొండి పట్టుదల చాలా తప్పు. బాధ పడకు, ఇప్పటికైనా సరిగ్గా ఆలోచిస్తున్నావు. మనిషి స్వభావం మార్చుకోవడం అంత తేలికైన పని కాదు. దానికి ఆత్మ విమర్శ చాలా అవసరం. చాలా మందికి అది ఉండదు. అది నీకు అలవాటు అయింది. నీకు ఇంక ఈ చీటీతో పనిలేదు" అని చీటీని పారవేసాడు.
బుచ్చిబాబు వెళ్లి పడుకున్నాడు. ఆసక్తి ఆగక తరువాత లేసి వెతికి చీటీలో ఏముందో చూసాడు.
అహంకారపు అడ్డుగోడల మధ్య ప్రపంచం ఇరుకుగానే ఉంటుంది. అవి దాటి చుస్తే విశాల ప్రపంచం ప్రత్యక్షం అవుతుంది.
Comments
Post a Comment