వస్తువు: రచయిత పెరిగిన ఊరు నల్లగొండ. రచయిత బాల్యంలో జరిగిన సంఘటనలే దీంట్లో కథా వస్తువులు.
కళ మన జీవితంలోని వివిధ భావాల గురించిన కథలు మనకు చెప్తుంది. అది సినిమా అయినా, పుస్తకం అయినా. జీవితంలోని కొన్ని కథలల్లో నాటకీయత ఉండకపోవచ్చు, ఉత్కంఠ ఉండకపోవచ్చు, సర్వ శక్తులు ఉండి పురాణ కథల పాత్రలను తలపించే పాత్రలు ఉండకపోవచ్చు . అది ఆడుకోడానికి సెలవుల కోసం ఎదురు చూసే చిన్న పిల్లాడి కథ కావచ్చు , రోజూ గంభీరంగా ఉండే నాన్న మనసు ఎంత సున్నితమో చెప్పే కథ కావచ్చు , చిన్నతనంలో స్నేహితులతో కలిసి చేసిన అల్లరి కథ కావచ్చు, ఊరు ఎంత అభివృద్ధి చెందినా చిన్నప్పటి పరిసరాలు లేవే అని ఫీల్ అయ్యే నోస్టాల్జియా గురించిన కథ కావచ్చు.
వీటి అన్నింటిలో లోతైన, సున్నితమైన మనిషి స్వభావపు కోణాలు ఉంటాయి. ప్రతి మనిషి తన జీవితంలో ఏదో ఒక సమయంలో లోనైన ఉద్వేగాలు ఉంటాయి. మానవ సంబంధాల గురించిన ఆసక్తికరమైన విషయాలు ఉంటాయి. కాని ఇలాంటి వాటికి చోటు ఇవ్వడంలో, న్యాయం చేయడంలో సినిమా పరిశ్రమ ఎందుకో వెనుక పడిపోయింది. పుస్తకాలలో మాత్రం వీటికి కాస్త న్యాయం జరుగుతుంది. అటువంటిదే ఒకటి ఈ పుస్తకం .
రచయిత తన బాల్యం గురించి రాసిన కథల సంపుటే ఈ పుస్తకం. తన బడిలో, ఇంట్లో అమ్మతో, నాన్నతో, స్నేహితులతో, ఇంకా వేరే మనుషులతో జరిగిన ఒక్కొక సాధారణ సంఘటన వస్తువుగా ఒక్కొక కథ ఉంటుంది. కథా మూలం సాధారణ సంఘటనలే అయినప్పటికీ ఆసక్తికరంగా ఉండే కథా కథన శైలి వల్ల, ఆత్మీయత కలిగిన కథా వస్తువులు అవ్వడం వల్ల ఈ కథలు నాకు బాగా నచ్చాయి. ఇంతే గాక నా బాల్యంలోని విషయాలు కొన్ని రచయిత గురించిన సంఘటనలను పోలి ఉండడం కూడా ఈ కథలని ఇష్ట పడడానికి ఒక కారణం అవ్వొచ్చు.
చదివినంత సేపు ఎవరో స్నేహితుడు నా పక్కన కూర్చుని ఇద్దరం ఒకరి విషయాలు ఇంకొకరితో చెప్పుకున్నంత ఆత్మీయ భావం కలిగింది. జీవితపు వేగానికి పరిగెడుతూ నెమరు వేసుకునే సమయం లేక మెదుడు పొరల్లో ఎక్కడో మూలన దాచి పెట్టిన ఎన్నో విషయాలు ఒక్కసారి కొంత విశ్రాంతిగా కూర్చుని ప్రశాంతంగా నెమరు వేసుకున్న భావన కలిగింది. రచనా శైలి గురించి ప్రత్యేకించి చెప్పుకోవాలి. పాఠకుడు కథలో లీనమయ్యేంత ఆసక్తికరంగా, హృద్యంగా కథను చెప్పే ప్రతిభ రచయితకు ఉన్నట్టు అనిపించింది.
చక్కటి తెలంగాణ యాసలో రాసిన ఈ కథలు ఎటువంటి వారైనా చదివి ఆనందించదగ్గ మంచి పుస్తకం.
Comments
Post a Comment