కలువ కాంతుడు కంచి చేరగానే భూమిని కప్పే చుక్కల చీకటి తెర అనంత నిశ్చల దృశ్యము చూడగా మదిలో మెదిలే ఎన్నో ఊసులు మెరిసే తారలు చూసి ఆనందంతో మురిసె ఒక మది మబ్బుల స్వేచ్ఛను చూసి స్వేఛ్చాకాంక్ష మెరిసెనొక మదిలో అంతులేని లోకాలు చూసి ఫిలాసఫీ వెలిగె ఇంకొక మనసులో సహించలేని శూన్యం చూసి దిగులు రెట్టింపయ్యే వేరొక యెదలో దృశ్యమొక్కటే, దృక్కోణాలెన్నో కనులు చూసేదొకటే, కనురెప్పల చాటున కలలు ఎన్నో చిత్రమొక్కటే, భావచిత్రాలెన్నో ప్రపంచమొక్కటే, భావప్రపంచాలెన్నో ఒక్కొక్క మదిలో ఒక్కొక్క కథ దాగి ఉన్నదా? చుట్టూ ఉన్న లోకంలో ప్రతిబింబాన్నే చూసుకుంటున్నదా?